రహదారి విస్తరణలో నష్టపోయిన వారిని ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని, పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. రోడ్లు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ టౌన్, పేటేరు రోడ్డు, అరవపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న గృహాలవారితో రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణాభివృద్ధిలో భాగంగా ఇప్పటికే అంకమ్మ చెట్టు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ఓల్డ్ టౌన్-పేటేరు, ఓల్డ్ టౌన్-అరవపల్లి రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభించటం జరుగుతుందని ఆ ప్రాంతవాసులు సహకరించాలని కోరారు.
గృహాల వారికి కొంత మేర నష్టం వాటిల్లిన వారిని పూర్తిగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. పూర్తిగా స్థలం కోల్పోయిన వారికి నూతనంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలో నిబంధనల మేరకు స్థలం మంజూరు చేయటంతో పాటు గృహ నిర్మాణ పథకంలో ఇల్లు కట్టించే బాధ్యతను తీసుకుంటామన్నారు. వ్యాపారాలు కోల్పోయిన వారికి బ్యాంకులతో సంప్రదింపులు జరిపి రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అరవపల్లి రోడ్డులో 85కుటుంబాలు, పేటేరు రోడ్డులో 30కుటుంబాల వరకు నష్టపోతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి ప్రభుత్వం తరుపున నష్టపరిహారంతో పాటు అన్ని విధాలుగా ఆదుకుని అండగా నిలుస్తామని చెప్పారు. ఇప్పటికే ఓల్డన్ నుంచి తుమ్మల వరకు డబుల్ రోడ్డు నిర్మాణం రూ. 30కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించటం జరిగిందన్నారు.
అంకమ్మ చెట్టు నుంచి అరవపల్లి రోడ్డులోని లోయావారివీధి వరకు 350 మీటర్ల మేరకు సీసీ రోడ్డు, డ్రెయిన్లు, పైపులైన్లు ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూరయిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, వైస్ చైర్మన్లు గుజ్జర్లమూడి ప్రశాంతకుమార్, తూనుగుంట్ల కాశీవిశ్వనాథగుప్త, కమిషనర్ విజయసారధి, తహసీల్దార్ విజయశ్రీ, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.