బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వంలో ప్రత్యేక కూటమి ఏర్పాటు కానున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై భావ సారూప్యం కలిగిన పార్టీలతో కలిసి పోరాటం సాగించేందుకు కాంగ్రెస్ సమర శంఖం పూరించింది. ఈ మేరకు 12 రాజకీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ శనివారం నాడు ఓ కీలక ప్రకటన జారీ చేసింది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే యత్నాలను అడ్డుకోవాల్సి ఉందని, ఇందుకోసం భావ సారూప్యం కలిగిన పార్టీలు తమతో కలిసి రావాలని కాంగ్రెస్ కోరింది. ప్రజలంతా సంయమనంతో వ్యవహరించి విచ్ఛిన్నకర శక్తులను అడ్డుకోవాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. భారత్‌ను విద్వేషం, మతోన్మాదం చుట్టుముడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సోనియా.. వీటిని ఆపకుంటే మరమ్మతు చేయలేనంతగా సమాజాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటివి కొనసాగకుండా ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చిన ఆమె.. గత తరాలు నిర్మించుకున్న దేశాన్ని విద్వేష సునామీ దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ జారీ చేసిన ఈ ఉమ్మడి ప్రకటనపై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ, తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ నేతృత్వంలోని జేఎంఎం, కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సారధ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్, బీహార్ విపక్ష నేత తేజస్వీ యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్, సీపీఐఎంల్ పార్టీల పేర్లు ఉన్నాయి.