లౌకిక శక్తులతో కలిసి రావాలని విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా విశాల ఉద్యమం మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా లౌకిక శక్తులు, పార్టీలు గళం విప్పుతుంటే రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితి నెలకొందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన 'దురదృష్టవశాత్తు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పరోక్షంగా, ప్రత్యక్షంగా బిజెపి, సంఘ్ పరివార్ చేస్తున్న మతోన్మాద చర్యలను ఉపేక్షిస్తున్నాయి. వాటి పట్ల నిశ్శబ్ధంగా ఉన్నాయి. ' అని అన్నారు.
ఈ వైఖరితో ఆ పార్టీలు మతోన్మాద చర్యలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు భావించవలసి వస్తుందని ఆయన చెప్పారు. 'అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ముందు పీఠిన ఉండి మతోన్మాద శక్తులు రాష్ట్రంలో తలెత్తడానికి పరోక్షంగా తోడ్పడుతోంది. తెలుగుదేశం ఆ రకమైన నిశ్శబ్దాన్నే పాటిస్తోంది.
జనసేన ఐతే దానికి అనుయాయిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది' అని చెప్పారు. ఆ పార్టీలు అనుసరిస్తున్న ఈ తరహా వైఖరి కారణంగా మతోన్మాద శక్తులను ఎదిరించే పని రాష్ట్రంలో ఒక్క వామపక్ష పార్టీలపై పడిందని అన్నారు. ఇటువంటి దురదృష్టకర పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. వామపక్షాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో అనేక లౌకిక వాద పార్టీలు, శక్తులు మతోన్మాదాన్ని నిలువరించే కృషిలో భాగస్వాములవుతున్నాయని చెప్పారు. 'మెజార్టీ మతోన్మాదమా. మైనార్టీ మతోన్మాదమా. అన్నది ప్రశ్నకాదు. అటువంటి విధానాలు అవలంబించి ప్రజలను చీల్చుతున్న వారినందరని ప్రతిఘటించి లౌకిక వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది' అని చెప్పారు.
ఈ నేపథ్యంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు తాము లౌకిక పార్టీలు అవునో, కాదో తేల్చుకోవాలని అన్నారు. 'లౌకిక పార్టీలని అనుకుంటున్నామంటే, దేశ వ్యాప్తంగా లౌకిక పార్టీలు, శక్తులు ఏ విషయంలో అయితే ముందుకు వస్తున్నాయో వాటితో ఆ విషయంలోనైనా కలిసి పనిచేయాలి. ' అని అన్నారు. లౌకిక శక్తుల్లో చాలా తేడాలున్నాయని, పరస్పరం విభేదించుకునే పార్టీలు కూడా ఉన్నాయని, అయినా కానీ, మతోన్మాదంతో ఉన్న ప్రమాదాన్ని గుర్తించి కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. 'అటువంటి పరిస్థితి ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? ' అని ప్రశ్నించారు. '
మీకు బిజెపికి, మీకు సంఘ్ పరివార్‌కు ఎటువంటి మిలాఖత్ ఉంది? ఒక వేళ లేకపోతే మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయడానికి ఎందుకు ముందుకు రారు;' అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి చావుతప్పి కన్నులట్టపోయన పరిస్థితి ఏర్పడిందని, దీంతో అధికారాన్ని నిలుపుకునేందుకు మరింతగా మతోన్మాద విషాన్ని కక్కి ప్రజలను చీల్చే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రశాంతంగా జరుపుకునే శ్రీరామనవమి, హనుమాన్‌జయంతి వంటి పండగ రోజుల్లోనూ ఆయుధాలు ఇచ్చి సంఘ్ పరివార్ శక్తులు ఘర్షణలకుపురిగొల్పుతున్నారని విమర్శించారు. దీన్ని ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ కూడా మెతక వైఖరి అనుసరిస్తోందని అన్నారు.
భారాలపైనా ఆదేతీరునరేంద్రమోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా ప్రజలపై పెద్ద ఎత్తున పడుతున్న భారాల విషయంలోనూ రాష్ట్రంలోని వైసిపి, టిడిపిలు మౌనం వహిస్తున్నాయని రాఘవులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక సంస్కరణలను అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం మరింత ఉత్సాహంగా అమలు చేస్తోందన్నారు. ప్రజలపై పడుతున్న భారాలను అడ్డుకునేందుకు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన వైసిపి ప్రభుత్వం ఆ పనిచేయకుండా కేంద్రం ఆదేశించిన భారాలను ఉత్సాహంగా అమలు జరుపుతోందన్నారు.
పెట్రోలు, గ్యాస్ ధరల పెరుగులతోపాటు అప్పుకోసం రాష్ట్ర ప్రభత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతోందని, ఇటీవలే ఆర్‌టిసి ఛార్జీలను పెంచారని, చెత్తపన్ను వేశారని చెప్పారు. ప్రజలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విశాల ఉద్యమం నిర్మిస్తామని తెలిపారు. రెండురోజులుగా జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రజలపై ఇష్టారాజ్యంగా మోపుతున్న భారాలను వెనక్కు తీసుకోవాలన్నారు.