ప్రైవేటు ఉద్యోగులకు ఓ శుభవార్త. సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకూలమైన ప్రతిపాదనకు త్వరలో ఆమోదముద్ర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రూ.15,000 వరకు వేతనం పొందుతున్న వారు ఈపీఎఫ్ పరిధిలోకి వస్తుండగా, దీన్ని రూ.21,000కు పెంచాలని ఓ అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. ఈ నిర్ణయం అమలు చేస్తే మరో 75 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ వో నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకం పరిధిలోకి వస్తారు. దాంతో వారు కూడా భవిష్యనిధి, పింఛను ప్రయోజనాలకు అర్హత సాధిస్తారు. ప్రస్తుతానికి రూ.15,000కు మించి వేతనాలు ఉన్న ఉద్యోగులకూ ప్రైవేటు సంస్థలు ఈపీఎఫ్ వో అమలు చేస్తున్నాయి. కాకపోతే గరిష్ఠ పరిమితి రూ.15,000పైనే ఈ ప్రయోజనం అందిస్తున్నాయి.
ఈఎస్ఐ పథకం కింద ప్రస్తుతం వేతన పరిమితి రూ.21,000 అమలవుతోంది. దీనికి అనుగుణంగా ఈపీఎఫ్ చట్టంలోనూ మార్పులు చేసేందుకు అడ్ హాక్ కమిటీ అంగీకరించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. రూ.21,000 వేతన పెంపును తర్వాత నుంచి అమలు చేయవచ్చని సూచించినట్టు చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఈపీఎఫ్ వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కరోనాతో బ్యాలన్స్ షీట్లు బలహీన పడినందున.. ప్రతిపాదిత వేతన పెంపు అమలుకు మరింత సమయం కావాలని కంపెనీలు కోరినట్టు సమాచారం.