సమ్మర్ లో చాలామంది చర్మ సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కురుల విషయంలో కూడా తీసుకోవాలి. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం ఉపయోగించే ఏసీలు, కూలర్ల వల్ల జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. ఈ క్రమంలో కురుల సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఉపకరించే కొన్ని హెయిర్ ప్యాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె+ఆలివ్ నూనె..
పావు కప్పు తేనెను తీసుకుని గోరువెచ్చగా వేడి చేయాలి. దీనికి పావు కప్పు ఆలివ్ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకుని వేడి నీటిలో ముంచిన టవల్‌ను చుట్టుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమంలో ఆలివ్ నూనెకి బదులుగా కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ పొడిబారిన జుట్టుకు తిరిగి జీవం పోస్తుంది.
ఉసిరితో..
ఎండ వల్ల జుట్టు పొడిబారడం, చివర్లు చిట్లడం, ఎక్కువగా రాలిపోవడం వంటి సమస్యలకు ఉసిరితో చెక్ పెట్టొచ్చు. కొన్ని ఉసిరి కాయలను తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను కుదుళ్లకు పట్టించి, మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. తలస్నానానికి ముందు ప్రతిసారీ ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది.
కోడిగుడ్డుతో..
ఒక గిన్నెలో చెంచా నిమ్మరసం, కోడిగుడ్లలోని రెండు పచ్చసొనలు, ఒక తెల్లసొన, చెంచా తేనె తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి తలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కోడిగుడ్డు జుట్టుకు పోషణనిస్తుంది. తేనె జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందిస్తుంది.
మినప్పప్పుతో
అర కప్పు మినప్పప్పుకి ఒక చెంచా మెంతులు కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీనికి అర కప్పు పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. మెంతులు వెంట్రుకల చివర్లు చిట్లడాన్ని తగ్గిస్తే, మినప్పప్పు జుట్టు కుదుళ్లు బలంగా చేయడంతో పాటు పొడవుగా పెరిగేలా చేస్తుంది.
కొబ్బరి నూనె+నిమ్మరసం
కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం కుదుళ్లకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటంతో పాటు పొడిబారే సమస్య తగ్గుతుంది.