ప్రేక్షకులకు ఎంతో ఉత్కంఠ పంచుతున్న ఐపీఎల్-2022లో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఏకంగా నలుగురు కోవిడ్ బారిన పడడం ఐపీఎల్ యాజమాన్యాన్ని కలవర పెడుతోంది. దీంతో పటిష్ట బయోబబుల్ మధ్య నిర్వహిస్తున్న ఐపీఎల్ కోవిడ్ వల్ల వాయిదా పడుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఢిల్లీ జట్టు ఫిజియో ప్యాట్రిక్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా జట్టులో చేరిన మిచెల్ మార్ష్ కోవిడ్ బారిన పడ్డట్లు సోమవారం వెల్లడైంది. దీంతో పుణె వెళ్లాల్సిన జట్టును ముంబై హోటల్ గదుల్లోనే ఉంచేసి, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిద్దరితో పాటు డాక్టర్ అభిజిత్ సాల్వి, మసాజ్ చేసే వ్యక్తికి కోవిడ్ నిర్ధారణ అయింది. అయితే ఈ ప్రభావం తదుపరి మ్యాచ్‌లపై ఉండదని ఢిల్లీ జట్టు యాజమాన్యం చెబుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీ-పంజాబ్ జట్ల మధ్య ఈ నెల 21న మ్యాచ్ జరుగుతుందని ప్రకటించింది. కోవిడ్ లక్షణాలు అధికంగా ఉన్నందున మార్ష్‌ను ఆసుపత్రిలో చేర్చామని, అతడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు ఢిల్లీ జట్టు యాజమాన్యం పేర్కొంది.