దేశంలో ఇటీవల కాలంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. రోజు వారీ కేసులు వెయ్యికి అటూ ఇటూ నమోదవుతూ వస్తున్నాయి. అయితే సోమవారం వెల్లడైన గణాంకాలతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఒక్కసారిగా 2,183 కేసులు వెలుగు చూడడం, 214 మరణాలు సంభవించడంతో కలవరం మొదలైంది. అయితే మంగళవారం వెల్లడైన గణాంకాలు కాస్త ఊరటనిచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,247 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. దీంతో నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయి. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఒకరు మృతి చెందారు. 928 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,45,527కు చేరింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు మొత్తం 5,21,966 మంది మరణించారు.