వేసవి ఉక్కపోత, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని తెలిపింది. దీని ఫలితంగా ఏపీ, తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీన పడినట్లు తెలియజేసింది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. వడదెబ్బతో ఇటీవల కాలంలో నలుగురు మృతి చెందడం కలవరపెడుతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా కురవనున్న వర్షాలతో ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉపశమనం కలగనుంది.