ఎండలు ముదురుతున్నాయి. పశువులు, పక్షులు ఉష్ణోగ్రతలు తట్టుకోలేక విలవిల్లాడుతున్నాయి. మరోవైపు వేళాపాలా లేని విద్యుత్ కోతలతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. కోళ్ల పెంపకందారులైతే ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు. కోళ్లు మృత్యువాత పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా కోళ్లు విక్రయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి లో వచ్చిన కథనం ప్రకారం, ఈ నాలుగు నెలల పాటు ఖాళీగా షెడ్లు ఉంచడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలా ల్లో కోళ్ల పరిశ్రమలు అధికం. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకంలో భాగంగా కోళ్ల ఫారా లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియోజక వర్గం నుంచే జిల్లాకు కోళ్లు సరఫరా జరుగు తుంది. కానీ ప్రస్తుతం ఎండలతో కోళ్లు మృత్యు వాత పడడుతుండడంతో సరఫరా తగ్గుముఖం పడుతోంది. రణస్థలం మండలంలో 290 మంది కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు ఉన్నారు. సుమారు 13 లక్షల వరకూ కోళ్లను పెంచుతున్నారు. ఎచ్చెర్లలో 3 లక్షల కోళ్లు, లావేరులో 80 వేలు కోళ్లు, జి.సిగడాంలో ఒక లక్ష వరకూ కోళ్లు పెంచుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఖర్చూ అధికం...సాధారణంగా ఒక్కో కోడిపిల్ల ధర రూ.50 వరకూ ఉంటుంది. 45 రోజుల పాటు మేతను అందిస్తే రెండు కిలోల వరకూ పెరుగుతుంది. ఒక్కో కోడికి మేత రూపంలో రూ.165 వరకూ ఖర్చవుతోంది. దీనికి మందుల ఖర్చు అధికం. దీనికితోడు విద్యుత్ చార్జీలు, కూలీల వేతనం చెల్లించాల్సి ఉంటుంది. గతం కంటే కోళ్ల పరిశ్రమల నిర్వహణ భారం పెరిగింది. పెరుగుతున్న ఎండలతో కోళ్లు మృత్యువాత పడకుండా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో ఖర్చు పెరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. షెడ్లపై వరి గడ్డి వేస్తున్నారు. వాటిపై నీరు చల్లుతున్నారు.
జాగ్రత్తలు అవసరం...వేసవిలో కోళ్ల పెంపకం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కోడి పిల్లలకు చల్లదనం కల్పించాలి. వేడి తగలకుండా షెడ్లు చుట్టూ తడిగోనె సంచులు అమర్చాలి. వాటిని ఎప్పటికప్పుడు నీటితో తడుపు తుండాలి.కోడి పిల్లలకు తరచూ నీరు అందించాలి.