ఒకపుడు వైసీపీలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తరువాత విజయసాయిరెడ్డి అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఇపుడు ఆ పరిస్థితి తారుమారైందని గుసగుసలు మొదలయ్యాయి. వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ షాకిచ్చారు. విశాఖ పార్టీ బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించారు. ఆ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. సుబ్బారెడ్డికి విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. ఉత్తరాంధ్రలో విజయసాయిపై పలు ఆరోపణలు రావడం, సొంత పార్టీ నేతలే అసంతృప్త స్వరాలను వినిపించడం తదితర పరిణామాల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. విజయసాయికి ఒక్క జిల్లా బాధ్యతను కూడా అప్పగించలేదు. విజయసాయికి ఇటీవలే పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాల బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయి ఇకపై విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి కేంద్రంగా పని చేయనున్నారు. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ మరింత ప్రాధాన్యతను కల్పించారు. పార్టీ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa