రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వారి గ్రామం నుంచి పరీక్ష కేంద్రం వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని ఆయా జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, జిల్లాల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్లకు ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఆదేశాలిచ్చారు. పరీక్ష అయిపోయాక ఇంటికి చేరుకునేందుకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అందులో సూచించారు. హాల్ టికెట్ ఆధారంగా బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాల వరకు రాకపోకలు సాగించొచ్చు. ఈ అవకాశం పదో తరగతి పరీక్షలు జరిగే ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 3,780 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 6,22,746 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.