కర్నాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా లేదు. ప్రస్తుతం కాలేజీలు, స్కూళ్లలో హిజాబ్‌పై కోర్టు ఆంక్షలు విధించింది. విద్యాసంస్థల్లో యూనిఫాం మాత్రమే ధరించాలని సూచించింది. ఇదిలా ఉండగా ఈ అంశంపై బీజేపీ నేత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాల్లోనూ హిజాబ్‌పై నిషేధం విధించే ఆలోచన ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి యశ్‌పాల్ సువర్ణ పేర్కొన్నారు. పబ్లిక్ ప్లేస్‌లలో హిజాబ్‌పై నిషేధం విధించాలని ఐరోపా దేశాలు ఆలోచిస్తున్నాయన్నారు. హిందూ దేశం కోసం కలలుగంటున్న మనం బహిరంగ ప్రదేశాల్లోనూ హిజాబ్‌పై నిషేధం అమలు ఎంతో అవసరమని గ్రహించాలని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం నుంచి కర్నాటకలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కోర్టు ఆదేశాలతో హిజాబ్ లేకుండా ముస్లిం బాలికలు పరీక్ష రాశారు. హిజాబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన రేషమ్, ఆలియా పరీక్షలు రాయకుండానే వెనుదిరిగారు.