సాఫ్ట్‌వేర్ సేవలు అందించే దేశీయ అగ్రగామి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అరుదైన ఘనతపై దృష్టిపెట్టింది. ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ సేవలందించే కంపెనీలలో నంబర్.1గా నిలిచేందుకు ప్రణాళికలు చేపట్టినట్లు వివరించింది. దీనిపై టీసీఎస్ సీఈవో ఎండీ, రాజేష్ గోపీనాథన్ స్పందించారు. ఓ మీడియాతో మాట్లాడుతూ తమ భవిష్యత్ లక్ష్యాలను ప్రకటించారు. ప్రస్తుతం తమ సంస్థ 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1,90,000 కోట్లు) ఆదాయం, 6 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉందని వివరించారు. సమీప భవిష్యత్తులో మరో నాలుగు రెట్లు వృద్ధిని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్‌ఎస్‌ఐ)లో ఐటీ సర్వీసులు అందిస్తున్న అతిపెద్ద కంపెనీగా టీసీఎస్ ఉందని వివరించారు. ఉద్యోగుల సంఖ్యలో ప్రపంచంలోనే తమ సంస్థ రెండవ స్థానంలో ఉన్నట్లు వివరించారు. ఇదే క్రమంలో భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో అగ్రస్థానానికి చేరుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.