కౌలు రైతు సమస్యను వైసీపీ ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లే జనసేన పార్టీ బయటకు తీసుకొచ్చిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 151 మంది శాసనసభ్యులు, 22 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు నిజంగా కౌలు రైతుల సమస్యలను గుర్తించి పరిష్కారం చూపించి ఉంటే జనసేన పార్టీ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు.
భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండటం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు మూడు వేల మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్ధిక భరోసా కల్పించేలా జనసేన పార్టీ ముందడుగు వేస్తోందని వెల్లడించారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో రచ్చ బండ నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన 41 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “భారత దేశంలో 80 శాతం మంది కౌలు రైతులే. మనం తినే ప్రతి మెతుకు వాళ్లు శ్రమతో పండించిందే. అప్పులు చేసి సాగుపై పెట్టుబడులు పెడితే ప్రకృతి విపత్తులు, గిట్టుబాటు ధరలు లేక చేసిన అప్పులు తీర్చలేక నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేవలం మూడంటే మూడు లక్షల అప్పు తీర్చలేక తనువు చాలిస్తున్న వారు ఉన్నారు. కొందరు పొలాల్లో చెట్లకు ఉరివేసుకుంటే, మరికొంతమంది పురుగుల మందులు తాగి చనిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల బాధలు వింటుంటే కడుపు తరుక్కుపోతోంది. పట్టాదారు పాస్ పుస్తకంలో పొరపాట్ల సవరణ కోసం గుంటూరు జిల్లాలో ఒక రైతు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ల బాధలు తీర్చాల్సింది ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.