కేరళ ఇడుక్కి జిల్లాలోని పుత్తడి గ్రామంలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. రవీంద్రన్(50), ఉష(45) దంపతులు తమ కొత్త ఇంట్లో సజీవదహనం అయ్యారు. గృహప్రవేశం జరిగిన 2 రోజులకే అగ్నిప్రమాదం సంభవించి దంపతులిద్దరూ మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన వారి కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
కేరళ ప్రభుత్వ సాయంతో రవీంద్రన్, ఉష దంపతులు కొత్త ఇంటిని ఇటీవల నిర్మించుకున్నారు. అయితే గృహప్రవేశం చేసిన రెండు రోజులకే ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత రవీంద్రన్, ఉషల కూతురు శ్రీ ధన్య ఇంటిపైనుంచి బయటకు దూకింది. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. అనంతరం శ్రీ ధన్య, ఆమె తల్లిదండ్రులకు ఆస్పత్రికి తరలించారు. అయితే దంపతులిద్దరూ అప్పటికే చనిపోయిటన్లు డాక్టర్లు తెలిపారు. కాలిన గాయాలైన కూతురికి మెరుగైన చికిత్స కోసం ఇడుక్కి ఆస్పత్రి నుంచి కోట్టాయం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.