భారత్‌లోకి భారీగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్న పాక్ స్మగ్లర్ల ప్లాన్ బెడిసి కొట్టింది. వారి కుట్రను ఇండియన్ కోస్ట్‌గార్డ్ భగ్నం చేశారు. ఏకంగా రూ.280 కోట్లు విలువైన 56 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడడంతో అంతా అవాక్కయ్యారు. గుజరాత్ సముద్ర తీరంలో పాకిస్తాన్‌కు చెందిన పడవ నుంచి ఈ మత్తుపదార్ధాలు లభ్యమయ్యాయి. బోటులో ఉన్న మొత్తం 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పంజాబ్, గోవా వంటి రాష్ట్రాలలో మత్తు పదార్థాల వినియోగం భారీ ఉందనే ఆరోపణలున్నాయి. ఈ మహమ్మారి ఇటీవల కాలంలో హైదరాబాద్‌కు కూడా పాకింది.
పాకిస్థాన్ నుంచి గుజరాత్‌కు సముద్రం ద్వారా స్మగ్లర్లు కొంత కాలంగా మత్తుపదార్థాలను తరలిస్తున్నారనే సమాచారం కోస్ట్‌గార్డ్‌కు అందింది. గుజరాత్ ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో కలిసి సంయుక్తంగా తీరంలో ఆపరేషన్ ప్రారంభించారు. కోస్ట్‌గార్డులను చూసిన పాక్ స్మగ్లర్లు తమ బోట్‌ను పాకిస్థాన్ వైపు వేగంగా మళ్లించారు. అయినప్పటికీ ఇండియన్ కోస్ట్‌గార్డ్ వారిని చుట్టుముట్టి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. పాక్ నుంచే భారత్‌కు ఎక్కువ మొత్తంలో మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయనే ఆరోపణలకు తాజా ఘటన బలం చేకూర్చుతోంది.