ఆ వ్యక్తి తన ప్రత్యర్థిని కిరాతకంగా హత్య చేశాడు. అందులోనూ సీఎం నివాసానికి అత్యంత సమీపంలోనే అధికార పార్టీ కార్యకర్త ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తన ప్లాన్‌తో పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి అతడికి భార్య గుర్తుకు వచ్చింది. ఆమెతో వాట్సాప్ చాట్ చేయగా పోలీసులు ట్రేస్ చేసి పట్టేశారు. సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కేరళలో సీపీఎం పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ కార్యకర్త పున్నోల్ హరిదాస్‌ను ఫిబ్రవరి 28న గుర్తు తెలియని వారు హత్య చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసానికి కూత వేటు దూరంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఈ కేసులో మొదట అనుమానితుడిగా పరకండి నిజిల్ దాస్ (38)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించి వదిలేశారు. అనంతరం విచారణలో భాగంగా నిజిల్ దాస్ ప్రధాన నిందితుడిగా తేలింది. అప్పటికే అతడు అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయాడు. ఈ లోపు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు. దానిని కోర్టు తిరస్కరించింది.
ఈ క్రమంలో సీపీఎం కార్యకర్త అయిన ప్రశాంత్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య రేష్మ సాయం తీసుకుని వారింట్లో నిజిల్ దాస్ తలదాచుకున్నాడు. అతడికి భార్య గుర్తుకు రావడంతో ఆమెకు వాట్సాప్ మెసేజ్ చేశాడు. వారిద్దరినీ పోలీసులు ట్రాక్ చేస్తున్న క్రమంలో వాట్సాప్ చాటింగ్ వ్యవహారం తెలిసింది. పోలీసులు శుక్రవారం ఉదయం ప్రశాంతి ఇంటిపై దాడి చేసి, నిజిల్ దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.