ఏపీలో మరో మూడు రోజులు ఎండ తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు తెలంగాణలో వర్షాలు కురుస్తుండగా, ఏపీలో మాత్రం ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఏపీ మూడు రోజుల పాటు నిప్పుల కుంపటిని తలపిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటికి రావొద్దని స్పష్టం చేసింది. వృద్ధులు, మహిళలు, గర్భవతులు ఇళ్లకే పరిమితం కావాలని, ప్రజలు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రవాలు తీసుకోవడం మేలని సూచించింది.
ఏపీలోని 41 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం కనిపిస్తుందని ఐఎండీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 25న విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో గరిష్ఠంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇతర జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తాజా బులెటిన్ లో పేర్కొంది. ఏప్రిల్ 26 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.