మన తెలుగు వాళ్లు దేశ, విదేశాల్లో సత్తా చాటుతున్నారని చెప్పడానికి ఇదో నిదర్శనం. పలు దేశాల్లోని చట్టసభల్లో విద్యార్థి రంగం నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుందన్న సంగతి తెలిసిందే. సామాజిక సేవపై ఆసక్తి చూపే విద్యార్థులు టీనేజిలోనే చట్టసభల్లో అడుగుపెడుతుంటారు. ఈ కోవలోనే ఏపీకి చెందిన దివి తనూజ్ చౌదరి ఆస్ట్రేలియా చట్టసభ సభ్యుడిగా నామినేట్ అయ్యాడు. దివి తనూజ్ చౌదరి స్వస్థలం నెల్లూరు జిల్లా కందుకూరు (గతంలో ప్రకాశం జిల్లాలో ఉండేది). తనూజ్ తండ్రి దివి రామకృష్ణ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆయన టంగుటూరుకు చెందిన ప్రత్యూషను పెళ్లాడి ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో స్థిరపడ్డారు. వారి కుమారుడు తనూజ్ చౌదరి ప్రస్తుతం ప్లస్ వన్ చదువుతున్నాడు.
తనూజ్ పాఠశాల స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవాడు. ఈ క్రమంలో అతడి అభిరుచిని, సామాజిక దృక్పథాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం విద్యార్థి ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఈ క్రమంలో తనూజ్ చౌదరి నిన్న చట్టసభకు కూడా వెళ్లొచ్చాడు. తెలుగు కుర్రాడికి ఆస్ట్రేలియాలో అరుదైన ఘనత లభించడం నిజంగా అభినందించాల్సిన విషయమే.