ఎలాన్ మాస్క్ రాకతో తమ సంస్థ ఉద్యోగుల్లో భవిష్యత్తు పై బెంగా నెలకొందని పరాగ్ అగర్వాల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ సంస్థలో ఆయన స్థానం పదిలమేనా అన్న సందేహం నెలకొంది. ట్విట్టర్ ను భవిష్యత్తులోకి తీసుకెళ్లేందుకు అన్ని సామర్థ్యాలు ఉన్న వ్యక్తి పరాగ్ అగర్వాల్. ఈ మాటలన్నది ఎవరో కాదు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే. ట్విట్టర్ ఆరంభం నుంచి సంస్థను ఎక్కువ కాలం లీడ్ చేసిన డార్సే.. తన టీమ్ నుంచి భారతీయుడు, విద్యానంతరం అమెరికాలో స్థిరపడిన పరాగ్ అగర్వాల్ ను ఎంపిక చేసి, తప్పుకున్నారు. ఇది జరిగి ఆరు నెలలు అయింది. 2021 నవంబర్ లో ట్విట్టర్ పగ్గాలను 37 ఏళ్ల పరాగ్ అగర్వాల్ చేపట్టారు.
ఆరు నెలలకే ట్విట్టర్ యాజమాన్యం చేతులు మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి పరాగ్ అగర్వాల్ ను ఎలాన్ మస్క్ కొనసాగిస్తారా..? దీనిపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే ట్విట్టర్ యాజమాన్యం పట్ల తనలో నమ్మకం లేదంటూ ఈ నెల 14న మస్క్ యూఎస్ స్టాక్ ఎక్సేంజ్ లకు తెలిపారు. కనుక ట్విట్టర్ బోర్డులో మార్పులకు అవకాశం ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనిపై కొన్ని రోజులు గడిస్తే కానీ స్పష్టత రాదు.
యాజమాన్యం నియంత్రణ మారిన ఏడాదిలోపు పరాగ్ అగర్వాల్ ను సీఈవోగా తప్పిస్తే అతడికి 42 మిలియన్ డాలర్లను (సుమారు రూ.315 కోట్లు) కంపెనీ చెల్లించాల్సి వస్తుందని పరిశోధన సంస్థ ఈక్విలర్ అంచనాగా ఉంది. మస్క్ ట్విట్టర్ కొనుగోలుకు జాక్ డోర్సే సైతం మద్దతు ప్రకటించడం తెలిసిందే.