కోవిడ్ ను నియంత్రించేందుకు టీకాలు వచ్చేసినా వాటిలో ఏదీ నిజంగా నియంత్రిస్తుందని చెప్పలేని పరిస్థితి. కానీ ఆస్తమా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఔషధం ‘మాంటెలుకాస్ట్’ సార్స్ కోవిడ్ 2ను తగ్గించడంలో సాయపడుతుందని బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆస్తమా, హే ఫీవర్, హైవ్స్ లో సాధారణంగా ఊపిరితిత్తుల్లో వాపు సమస్య ఏర్పడుతుంది. దీన్ని తగ్గించడంలో మాంటెలుకాస్ట్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఐఐఎస్ సీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ఔషధం సార్స్ కోవిడ్ ప్రొటీన్ అయిన ఎన్ఎస్ పీ1ని గట్టిగా బంధిస్తుంది. మానవ కణాల్లోకి ముందుగా ప్రవేశించే ఎన్ఎస్ పీ1ను అడ్డుకుంటుంది. ఈ ప్రొటీన్ మన రోగనిరోధక కణాల లోపల ప్రొటీన్-తయారీ యంత్రాలను రైబోజోమ్‌లతో బంధించగలదు. రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన ప్రొటీన్ల సంశ్లేషణను అడ్డుకుంటుంది. ఫలితంగా కరోనా వైరస్ ప్రొటీన్ అయిన ఎన్ఎస్ పీ1 బలహీనపడుతుంది.
ఈ అధ్యయన వివరాలు జర్నల్ 'ఈ లైఫ్'లో ప్రచురితమయ్యాయి. కరోనా ఏ వేరియంట్ లో అయినా వైరస్ ప్రొటీన్ అయిన ఎన్ఎస్పీ1 పెద్దగా మార్పు చెందడం లేదని.. దీన్ని లక్ష్యంగా చేసుకునే ఔషధాలు ఏవైనా అన్ని కరోనా వేరియంట్లకూ చికిత్సగా పనికి వస్తాయని పరిశోధక బృందం అభిప్రాయపడింది.