ఇద్దరు నకిలీ డాక్టర్లు ఓ మహిళ మరణానికి కారణమయ్యారు. సంతానం కలిగేలా చేస్తామని చెప్పి ప్రాణం పోయేలా చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా బెలగరహళ్లిలో జరిగింది. మల్లికార్జున్, మమత దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వారికి ఇప్పటివరకు పిల్లలు కలగలేదు. సంతానం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ క్రమంలో మంజునాథ్, వాణి అనే నకిలీ డాక్టర్ దంపతులు మమత, మల్లికార్జున్లను సంప్రదించారు. ఐవీఎఫ్ చికిత్స ద్వారా సంతానం పొందేందుకు సాయం చేస్తామని చెప్పారు. వారిని నమ్మిన మమత దంపతులు ఇందుకోసం ఆ నకిలీ డాక్టర్లకు రూ. 4 లక్షలు చెల్లించారు. కడుపులో బిడ్డ పెరుగుతుందని చెప్పి మమత దంపతులను మరికొంత డబ్బు అడిగారు.
కొద్ది రోజుల తర్వాత మమతకు భరించలేని కడుపునొప్పి వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో మల్లికార్జున్ తన భార్యను వేరే ఆస్పత్రిలో చేర్పించాడు. దీంతో మమత గర్భవతి కాదనే విషయం తెలిసింది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన మమత మూడు నెలలుగా చికిత్స తీసుకుంది. అయినా పరిస్థితి విషమించడంతో ఈనెల 23న మృతి చెందింది. కట్టుకున్న భార్యను, డబ్బులను పోగోట్టుకొని మల్లికార్జున్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.