సాధారణంగా నగరాలలో ఉండే వారు ఉతికిన దుస్తులను బాల్కనీలలోనే ఆరేస్తుంటారు. ఇందులో వింతేమీ లేకపోయినా ఇక నుంచి అలా చేస్తే రూ.20 వేల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనను ఓ నగరంలో విధించడంతో అక్కడి ప్రజలంతా అవాక్కవుతున్నారు. ఏ మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా బట్లలు ఆరేస్తే భారీ జరిమానా తప్పనిసరిగా కట్టాల్సిందే. దీంతో ఉతికిన దుస్తులు ఎక్కడ ఆరేసుకోవాలో తెలియక అక్కడి ప్రజలు అయోమయంలో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అరబ్ దేశాలలో నిబంధనలు కఠినతరంగా ఉంటాయి. హత్య, అత్యాచారం వంటి నేరాలలో అక్కడ ఇప్పటికీ మరణశిక్షలు విధిస్తుంటారు. రోడ్డుపై పొరపాటున ఉమ్మినా జైలుకు వెళ్లాల్సిందే. తాజాగా యూఏఈ రాజధాని అబుదాబి మున్సిపాలిటీ ఇటీవల ఓ వింత నిబంధన విధించింది. ప్రజలు బాల్కనీలలో దుస్తులు ఆరేయకూడదని హెచ్చరించింది. ఒకవేళ నిబంధనను పట్టించుకోకుండా బట్టలు ఆరబెడితే వెయ్యి దిర్హమ్‌లు (రూ.20 వేలు) ఫైన్ కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బాల్కనీలలో దుస్తులు ఆరేస్తుండడం వల్ల నగర అందం దెబ్బతింటుందనేది అధికారుల వాదన. నేర తీవ్రతను బట్టి అవసరమైతే జైలు శిక్ష కూడా ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీంతో అబుదబి ప్రజలకు కొత్త చిక్కు వచ్చి పడింది. చేసేదేమీ లేక ఇళ్లలోపలే దుస్తులు ఆరబెట్టుకుంటున్నట్లు సమాచారం.