కరోనాతో కలవరం చెందుతున్న చైనాలో H3N8 బర్డ్ ఫ్లూ కేసు తొలిసారి మనుషుల్లో బయటపడింది. అయితే మనుషుల్లో వ్యాపించే ముప్పు తక్కువగా ఉన్నట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్ కు చెందిన నాలుగేళ్ల బాలుడికి H3N8 స్ట్రెయిన్ సోకినట్లు తెలిపింది. ఈనెల ఆరంభంలో జ్వరం, ఇతర లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన బాలునికి పరీక్షలు నిర్వహించగా.....పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. బాధితుడి కుటుంబం కోళ్లను పెంచుతుందని, అడవిబాతులు ఉండే ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపింది. బాలుడికి నేరుగా పక్షుల నుంచి H3N8 స్ట్రెయిన్ సోకినప్పటికీ మానవులపై తీవ్ర ప్రభావం చూపే సామర్థ్యం లేదని చైనా హెల్త్ కమిషన్ పేర్కొంది. బాలుడికి సన్నిహితంగా ఉండే వారికి కూడా పరీక్షలు నిర్వహించినప్పటికీ. వారిలో అసాధారణ లక్షణాలేవీ కనిపించలేదని వెల్లడించింది. చనిపోయిన, వ్యాధిబారిన పడిన పక్షులకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించిన చైనా హెల్త్ కమిషన్ జ్వరం లేదా శ్వాస సంబంధ సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.