రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకంలో ఈ-కేవైసీ ఆప్షన్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఈ పథకంలో భాగంగా ఏటా 3 దఫాల్లో రూ.6 వేలను వారి ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. 11వ విడతలో భాగంగా పథకం సాయం పొందేందుకు గతంలో ఈ-కేవైసీ తప్పనిసరి అని చెప్పింది. ఆ తర్వాత ఈ-కేవైసీని తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుతం తిరిగి పునరుద్ధరించింది.
ఇందులో భాగంగా పథకం నుంచి ప్రయోజనం పొందే రైతులు మే 31, 2022లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ-కేవైసీని పూర్తి చేసేందుకు రైతులు సీఎస్‌సీ(కామన్ సర్వీసు సెంటర్ల)కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కేంద్రం సూచించింది.