ఉక్రెయిన్‌లో 63 రోజులుగా విధ్వంసకాండ చేస్తున్న రష్యా సైనికుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపైనా, చిన్నారులపైనా వారు అత్యాచారాలకు పాల్పడడంపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ 16 ఏళ్ల బాలికపై రష్యా సైనికుడు బెదిరించి అత్యాచారానికి పాల్పడడం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. బాధిత యువతి కథనం ప్రకారం ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ సమీప గ్రామంలోకి మార్చిలో రష్యా సేనలు ప్రవేశించాయి. దీంతో ఓ కుటుంబం బేస్‌మెంట్‌లో తలదాచుకుంది. ముగ్గురు కుమార్తెలకు ఆకలి వేస్తుందని గ్రహించిన వారి తల్లి ఆహారం తీసుకొచ్చేందుకు బయటకు వచ్చింది. ఆ సమయంలో వారిని వెంబడిస్తూ ఓ రష్యా సైనికుడు ఇంటికి వచ్చేశాడు.
తొలుత ఆ సైనికుడు ఓ గదిలోకి వారి కుటుంబంలో తల్లిని పిలిచాడు. ఆమెను అనుభవించాక బయటకు పంపేశాడు. ఆ తర్వాత ఆమె కుమార్తెల వయసు ఎంతని అడిగాడు. 16 ఏళ్లున్న పెద్ద కుమార్తెను లోపలికి పిలిచాడు. రాకుంటే మరో 20 మందిని రప్పించి, సామూహిక అత్యాచారం చేయిస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక వెళ్లగానే ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఇటీవల మీడియా ముందు చెబుతో బాధిత బాలిక బోరుమని ఏడ్చింది. ఆకలితో తాము పస్తులు పడినా బాగుండేదని, ఆహారం కోసం బయటకు వెళ్లడంతో ఈ దారుణం జరిగిందని ఆ బాలిక చెప్పడం విని అంతా చలించిపోయారు. దీనిపై ఉక్రెయిన్ అధికారులు విచారణ చేపట్టగా వాస్తవమేనని తేలింది. ఇలాంటి ఘటనలు ఉక్రెయిన్ అంతటా జరుగుతున్నాయని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.