నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు.. ఎవరు ఉండరు. అందులో చికెన్ ఐటమ్స్ అంటే ముందే రెడీ అయిపోతారు. అలాంటి ఓ స్పెషల్ నాన్ వెజ్ రెసిపీనే తందూరి చికెన్. తందూరి చికెన్ అనగానే.. నోరు ఊరిపోతుంది. కానీ దీనిని ఇంట్లో తయారు చేయాలంటే.. కొంచెం కష్టం అని అనుకుంటుంటారు. చాలా ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఓవెన్ లేదా తందూర్ లేకపోయినా... ఒక పెద్ద పాన్‌లో కొద్దిగా నూనె వేసి తందూరి చికెన్‌ను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
కావల్సిన పదార్థాలు: చికెన్: అరకేజీ ,ఉల్లిపాయ: ఒకటి ,నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్ ,వెల్లుల్లి రెబ్బలు: రెండు ,అల్లం: ఒక చిన్న ముక్క ,రెడ్ ఫుడ్ కలర్ : కొన్ని చుక్కలు ,పచ్చిమిర్చి: రెండు ,మసాలా: రెండు టేబుల్ స్పూన్ ,ఉప్పు: రుచికి సరిపడా, నూనె: రెండు, మూడు టేబుల్ స్పూన్లు.
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి తడి ఆరే వరకూ పక్కను పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ముక్కలకు గాట్లు పెట్టుకోవాలి. నిమ్మరసం ఉప్పు చికెన్ ముక్కలకు పట్టించాలి. గాట్లులోకి కూడా నిమ్మరసం పట్టేలా చూసుకోవాలి. తర్వాత ఈ చికెన్ ముక్కలను 20 నిమిషాలు రిఫ్రిజరేటర్‌లో పెట్టుకోవాలి. అంతలోపు ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గరం మసాలాను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. రెండు గంటల తర్వాత ఫ్రిజ్‌లో ఉన్న చికెన్ ముక్కలను బయటకు తీసి మసాలా పేస్ట్‌ను పట్టించాలి. చికెన్ ముక్కలకు మసాలను పట్టించడానికి ముందు మసాలాలో కొద్దిగా ఫుడ్ కలర్‌ను యాడ్ చేసుకోవాలి. మసాలా పట్టించిన తర్వాత మళ్లీ చికెన్ ముక్కలను రిఫ్రిజరేటర్‌లో 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచాలి. నాలుగు గంటల తర్వాత చికెన్ బయటకు తీసి, పాన్ స్టౌ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద 10-15 నిమిషాల వరకూ ఒక్కో వైపు బాగా కాలనివ్వాలి. 15 నిముషాల తర్వాత చికెన్‌ను మరోవైపు తిప్పి మీడియం మంట మీద ఇలా అన్ని వైపులా నిదానంగా వేగనివ్వాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత బయటకు తీసి, గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. అంతే ఈజీగా తందూరి చికెన్ రెడీ అవుతుంది.