బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రేపల్లె ఎంపీడీఓ చంద్ర సువార్త అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులకు నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు చేయడంతో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అనేక సమస్యలను తలెత్తుతాయన్నారు. వయస్సు, పరిపకత్వ లేకుండా వివాహాలు చేస్తే వారి భవితవ్యం అంధకారంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు.
మహిళలు గర్భస్థ సమయంలో అనేక ఇబ్బందులు పడతారని, మృత్యువాత పడేందుకు అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. మహిళలకు కనీసం 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు వివాహ వయస్సు నిండాలని అన్నారు. అంగన్వాడీలు, మహిళా పోలీసులే కాకుండా తమ పరిసరాల్లో ఎక్కడైన బాల్య వివాహాలు జరిగితే అధి కారులకు సమాచారం అందించాలని కోరారు. అక్షయ తృతీయ రోజున ఈ వివాహాలు చేసే మూఢాచారాలు సమాజంలో నెలకొన్నాయని, ఆ రోజు ఈ విధానంపై దృష్టిసారించాలన్నారు. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్ విజయశ్రీ, ఇన్ చార్జ్ సీడీపీఓ మాణిక్యం, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.