చీరాల మాజీ ఎంపీపీ, రాష్ట్ర పట్టణాభివృద్ధి మౌలిక వసతుల కల్పన సంస్థ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావును రెండు ఎస్సీ ఎస్టీ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలో ఉద్రిక్తత నెలకొన్న నేపధ్యంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఆయన ను పర్చూరు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గవిని శ్రీనివాసరావు కు న్యాయమూర్తి పధ్నాలుగు రోజుల రిమాండ్ విధించారు.
ఒక దళిత మహిళను ఉద్దేశించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్ పెట్టారనే ఫిర్యాదు మేరకు ఆయన మీద ఒక ఎస్సీఎస్టీ కేసు నమోదైంది. కాగా ఈ గొడవ విషయమై కనుక్కునేందుకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తాను రాగా తనను శ్రీనివాసరావు కులం పేరు పెట్టి దూషించాడని కంచర్ల చిట్టిబాబు అనే దళితుడు శుక్రవారం మరో ఫిర్యాదు ఇవ్వగా దాని పైనా కేసు కట్టారు.
అంతకుముందు బాపట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఏవీ రమణ ఈ ఫిర్యాదులపై విచారణ జరిపారు. సాక్షులను విచారించారు. తదుపరి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా తనపై విక్టర్ ప్రసాద్, కిశోర్ లనే వారు దాడి చేశారని గవిని శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి పైన కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ ఇద్దర్ని కూడా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జుడిషియల్ రిమాండ్ విధించారు.