మళ్లీ వైసీపీ వర్సెస్ టీఆర్ఎస్ (పోరు మొదలైంది.ఆంధ్రప్రదేశ్ లోని మౌలిక వసతుల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. డేట్, టైమ్ చెప్పు కేటీఆర్.. ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా అని ఓ మంత్రి అంటే.. నాలుగు కాదు 400 బస్సుల్లో ఏపీకి వచ్చి చూడండి అని మరో మంత్రి సవాల్ విసురుతున్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ నోటి తొందర తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు.
కరోనా సమయంలో జనం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన విషయం ఆయనకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ , కేటీఆర్ చెప్పేవన్నీ కేవలం మాటలే అని విమర్శించారు. అదే సీఎం జగన్ ఏదైనా చెప్పారంటే, అది చేసి తీరుతారని అన్నారు. తెలంగాణ లో కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. జగన్ మా సీఎం అయితే బాగుండు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని పేర్నినాని అన్నారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
అసలు కేటీఆర్ ఏమన్నారంటే..? శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతులు సరిగా లేవని.. కరెంట్ సరిగా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తన మిత్రులు తనతో స్వయంగా చెప్పారని అన్నారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయి. అదే తెలంగాణ విషయానికి వస్తే.. చాలా ప్రశాంతమైన రాష్ట్రం. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందన్నారు..
ఇక కేటీఆర్ కు కౌంటర్ గా మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ వంటివారు కేటీఆర్ కామెంట్స్ ఖండించారు. తాజాగా మంత్రి రోజా (కూడా ఈ లిస్టులో చేరారు. ఐతే ఆమె ప్రగతి భవన్లోనే కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏపీ విషయంలో కేటీఆర్ ను ఎవరో తప్పుదోవ పట్టించినట్లు అర్ధమవుతుందన్నారు. అలాగే ఆయన పొరుగు రాష్ట్రాలు అన్నారే తప్ప.. ఆంధ్రప్రదేశ్ అనలేదన్నారు. ఒకవేళ ఆయన నిజంగా ఏపీని ఉద్దేశించి అంటే కేటీఆర్ మాటలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ టైం, డేట్ చెబితే.. తానే వచ్చి తీసుకెళ్లి ఏపీ మొత్తం చూపిస్తాను అన్నారు.