ఐపీఎల్-2022లో మ్యాచ్‌లు ప్రేక్షకుల ఊహకు మించి ఉత్కంఠను పంచుతున్నాయి. మ్యాచ్‌లలో ఫలితాలు చివరి బంతికి కూడా తారుమారు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రెండు మ్యాచ్‌లు జరగనుండడంతో ఐపీఎల్ వీక్షకులకు వీనుల విందు కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 6 విజయాలు సాధించగా, మూడింటిలో పరాజయం పాలైంది. 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. మరోవైపు నిలకడ అయిన ఆటతీరు ప్రదర్శించలేక రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు తడబడుతోంది. తాజా ఐపీఎల్ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో ఉంది.
ఇక రెండవ మ్యాచ్‌లో రాత్రి 7.30 గంటలకు పుణెలోని ఎంసీఏ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద జట్టు టోర్నీలో అద్భుతంగా పుంజుకుంది. మరోవైపు వరుస ఓటముల నేపథ్యంలో చెన్నై జట్టు కెప్టెన్సీకి జడేజా రాజీనామా చేశాడు. అతడి స్థానంలో తిరిగి ధోని సారథ్య బాధ్యతలు చేపట్టాడు. దీంతో చెన్నైని ధోని పట్టాలెక్కిస్తాడా అనే అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి.