జాతీయ రాజకీయాలలో పీ.కే.వ్యవహారంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా రాబోయే రోజుల్లో కూడా తాను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసే పని చేస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరబోవడం లేదంటూ ప్రశాంత్ కిశోర్ ప్రకటించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంత్ కిశోర్ సైద్ధాంతిక నిబద్ధతపై తమ పార్టీలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారని, అయినా తాను ప్రశాంత్ కిశోర్ తో కలిసి ప్రయాణించడానికే మొగ్గు చూపానని తెలిపారు. పీకేకు ఇచ్చే బాధ్యతలపై తమ పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అయినప్పటికీ ఆయనతో కలిసి పని చేయాలని తాము నిర్ణయించామని చెప్పారు.
పీకేకు ఓ రాజకీయ సిద్ధాంతం లేదని కాంగ్రెస్ లోని పలువురు సీనియర్లు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. కానీ, పీకే విషయంలో సోనియాగాంధీ ముందుకే కదిలారు. అయినప్పటికీ తాను కాంగ్రెస్ లో చేరబోనని, కేవలం సలహాదారుడిగా మాత్రమే పని చేస్తానని పీకే చెప్పారు.