అంపైర్ తీరువల్లే తాను ఓటమి చెందాల్సి వచ్చిందని పీ.వీ.సింధు ఆవేదన వ్యక్తంచేశారు. ఇదిలావుంటే అంపైర్ తప్పుడు నిర్ణయం.. పీవీ సింధుకు మ్యాచ్ నే చేజారేలా చేసింది. ఆమె తప్పు లేకపోయినా ప్రత్యర్థికి పెనాల్టీ రూపంలో ఒక పాయింట్ తో పాటు సర్వీస్ నూ ఇచ్చేయడంతో ఆమెపై మానసికంగా ఎఫెక్ట్ పడి మ్యాచ్ నే కోల్పోవాల్సి వచ్చింది. నిన్న బ్యాడ్మింన్ ఆసియా చాంపియన్స్ సెమీ ఫైనల్ లో వరల్డ్ సెకండ్ సీడ్ జపాన్ కు చెందిన అకానే యమగుచితో పీవీ సింధు మ్యాచ్ ఆడింది. తొలి సెట్ ను 21–13తో గెలిచి చాలా పై చేయిని సాధించింది. అయితే, సెకండ్ సెట్ లోనూ 14–11తో లీడ్ లో ఉన్న సింధును అంపైర్ మానసికంగా దెబ్బతీశాడు.
సింధు తప్పు లేకపోయినా.. యమగుచికి పెనాల్టీ కింద ఒక పాయింట్ ఇచ్చేశాడు. సర్వ్ నుంచి సింధును తప్పించాడు. దీనిపై సింధు.. అంపైర్ తో వాగ్వివాదానికి దిగింది. తన తప్పు లేకుండా పాయింట్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ప్రత్యర్థి అక్కడ సిద్ధంగా లేనప్పుడు తానెలా సర్వ్ చేస్తానంటూ చైర్ అంపైర్ ను నిలదీసింది. ఆగ్రహంతో ఊగిపోయింది. చీఫ్ రెఫరీ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, సింధు చెప్పిన విషయాలనేవీ అంపైర్లు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో సింధు ఆగ్రహంతో ఊగిపోయింది.
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న యమగుచి మిగతా సెట్లను చేజిక్కించుకుని మ్యాచ్ గెలిచింది. అయితే, మ్యాచ్ అయ్యాక ప్రెజెంటేషన్ సమయంలోనూ అంపైర్ల తీరుపై సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంపైర్ల నిర్ణయాలు సరిగ్గా లేవని మండిపడింది. ‘‘నేను సర్వ్ చేసే సమయానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. అలాంటప్పుడు ఎలా సర్వ్ చేయగలను? కానీ, అంపైర్ నా తప్పే అన్నట్టుగా పాయింట్ ఆమెకిచ్చేశాడు. అదే నేను మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైందని అనుకుంటున్నా. వాస్తవానికి నాకు రావాల్సిన పాయింట్ అది. 15–11కు వెళ్లిన నన్ను.. లేట్ చేస్తున్నానన్న కారణంగా పెనాల్టీ వేసి.. ఆమెకు పాయింట్ ఇవ్వడం సరికాదు. ఆమె రెడీగా లేనప్పుడు నాకు ఎలా పెనాల్టీ వేస్తారు? ఇది అనైతికమైన నిర్ణయం. నిర్ణయం సరిగ్గా తీసుకుని ఉంటే నేనే మ్యాచ్ గెలిచి.. ఫైనల్స్ ఆడేదాన్నేమో.
మ్యాచ్ చీఫ్ రిఫరీకి చెప్పినప్పుడు.. పట్టించుకోలేదు. చీఫ్ రెఫరీగా కనీసం రీప్లేలు చూసి ఎవరి తప్పు ఏంటి అన్నది చూడాల్సింది. కానీ, అంతా అయిపోయిందంటూ తప్పించుకోవడం దారుణం’’ అని సింధు వ్యాఖ్యానించింది. ఆమె మాటలు విని పక్కనే ఉన్న విన్నర్ యమగుచి కంగుతిన్నది. ఈ మ్యాచ్ లో 21–13, 19–21, 16–21 తేడాతో సింధు ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.