రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఈ నెలలో సూర్యుడి ప్రతాపం ఎన్నడూ లేని విధంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా భారత్ లో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. వడగాడ్పులు కూడా అదే నెలలో వీస్తుంటాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఏప్రిల్ నెలలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముఖ్యంగా, వాయవ్య, మధ్య భారతదేశంలో ఎండలు మండిపోయాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రతలే 35.9 నుంచి 37.78 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది. వాయవ్య, మధ్య భారతదేశంలో ఈ స్థాయిలో అధిక వేడిమి నమోదు కావడం గత 122 ఏళ్లలో ఇదే ప్రథమం అని వివరించింది.
ఇప్పటికే ఠారెత్తిస్తున్న ఎండలతో అల్లాడిపోతున్న రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మే నెలలోనూ వేసవి తాపం తీవ్రస్థాయిలో ఉంటుందని ఐఎండీ పేర్కొంది. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే, మే నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రివేళల్లో సైతం వేడిగా ఉంటుందని తెలిపింది.