మనం తినబోయే బయటి ఫుడ్ ధరలపై త్వరలో ప్రభావం పడనున్నది. కారణం కమర్షియల్ గ్యాస్ ధర అమాంతంగా పెరగడమే. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ద్రవ్యోల్బణం మోత మోగిస్తోంది. వంట నూనెలు సలసలమంటున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా ధరలు మండుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు కూడా కస్టమర్లకు గుది బండలా మారాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.102 పైగా పెంచి కస్టమర్లకు షాకిచ్చాయి. అయితే ఈ పెంపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై చేపట్టాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరగలేదు. కొత్త ధర అమల్లోకి వచ్చిన తర్వాత.. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2355కు పెరిగింది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.102.50 మేర పెరిగింది. ప్రతి నెలా 1వ తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తాయి. ఈ సమీక్షలో భాగంగానే నేడు కొత్త రేట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేశాయి. ఈ రేట్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.102 పైగా పెంచుతున్నట్టు దేశంలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఐఓసీ పేర్కొంది. గత నెలలో కూడా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.250 మేర కంపెనీ పెంచింది.
ఢిల్లీలో ప్రస్తుతం 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కోసం రూ.2355.50 చెల్లించాల్సి వస్తుంది. నిన్నటి వరకు ఈ రేటు రూ.2253గా ఉంది. అలాగే మన హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2563.5కు పెరిగింది. ఈ ధర అంతకుముందు రూ.2460గా ఉండేది. విశాఖపట్నంలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిడర్ ధర రూ.2321 నుంచి రూ.2413కు ఎగిసింది. అలాగే కోల్‌కత్తాలో ఈ గ్యాస్ సిలిండర్ రేటు రూ.2351 నుంచి రూ.2455కు పెరిగింది.
ముంబైలో రూ.2205 నుంచి రూ.2307కు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తమిళనాడులోని చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2406 నుంచి రూ.2508 వరకు పెరిగింది.
కమర్షియల్ సిలిండర్ ధరలు పెరుగుతుండటంతో.. వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ధరల పెంపు మేరకు రెస్టారెంట్ ఓనర్లు, పలు ఫుడ్ ఐటమ్స్‌ను విక్రయించే దుకాణాలు కూడా రేట్లను పెంచుతున్నాయి. చివరిసారి ధర పెంచినప్పుడే రేట్ల పెంపును 10 శాతం వరకు చేపట్టనున్నట్టు వ్యాపారులు చెప్పారు. తదుపరి నెలలో కూడా ప్రభుత్వం వీరికి బ్యాడ్‌న్యూస్ చెప్పడంతో.. ఈ ప్రభావం నేరుగా వినియోగదారులపైనే పడనుంది. ఇక రెస్టారెంట్లకు వెళ్లి తినడం కష్టమవనుంది. మిగతా అన్ని రేట్లు కూడా పెరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa