సెమిస్టర్ ఫీజు చెల్లించలేదని విద్యార్థినులను హాస్టల్ నుండి గెంటేసిన వైనం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో భారతీయ ఇంజనీరింగ్ , సైన్స్ టెక్నాలజీ బెస్ట్ ఇన్నోవేషన్ వర్సిటీ లో చోటుచేసుకుంది. ఆ ఫీజు చెల్లించలేదనే ఉద్దేశంతో ఆర్డీటీ కార్యాలయం వద్దగల బాలికల హాస్టల్లోని విద్యార్థులకు అన్నం పెట్టకుండా వేధించారు. నిర్దాక్షిణ్యంగా హాస్టల్ నుంచి 80 మంది విద్యార్థినుల ను వారి లగేజీతో సహా బయటకు పంపించారు. దీంతో ఏఐవఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు హిందూపురం - కదిరి ప్రధాన రహదారిపై బైఠాయించి , ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా విద్యార్థినులు మాట్లాడుతూ కేవలం 5 వేల సెమిస్టర్ ఫీజు చెల్లించలేదని ఓ ప్రైవేటు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థినులను నిర్దాక్షిణ్యంగా లగేజీతోపాటు హాస్టల్ నుంచి గెంటేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నఫళం గా గెంటేస్తే ఎక్కడికెళ్లాలంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అగ్రికల్చర్ బీఎస్సీ తదితర కోర్సుల కోసం ఒక్కో విద్యార్థి రూ. 5 లక్షలకుపైగా చెల్లించినట్లు పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు గోరంట్లలో విడివిడిగా అద్దె భవనాల్లో హాస్టల్స్ ఏర్పాటు చేశా రు. ప్రస్తుతం సెమిస్టరే ముగియలేదు. తరువాతి సెమిస్టర్ ఫీజుకు సంబంధించి రూ. 5 వేలు అడ్వాన్సుగా చెల్లించాలని యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి, చేస్తోంది. పోలీసుల జోక్యంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అనంతరం వర్సిటీ అదనపు రిజిస్ట్రార్ రాజన్నను పిలిచి చర్చించారు.