మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపడుతున్న సమయంలో గుండె పోటుకు గురై వేతనదారుడు మృతి చెందిన సంఘటన హిరమండలం మండలంలో చోటు చేసుకుంది. మర్రిగూడ పంచాయతీ బొండిగూడ గిరిజన గ్రామంలో యధావిధిగా ఉపాధి పనులు చేపడుతున్న సవర లింగయ్య (61) ఒక్కసారిగా గుండెనొప్పి రావటంతో పనుల చోట కుప్పకూలి పోయాడు. వేతనదారులు, క్షేత్ర సహాయకులు చికిత్స అంద జేసినప్పటకీ ప్రయోజనం లేకపోయింది. ఎంపీడీవో, ఏపీవో లకు సమాచారం అందివ్వటంతో సంఘటనా ప్రాంతానికి ఎంపీడీవో జి. కాశీవిశ్వనాథ్, ఏపీవో ఎ. శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు సవర వైకుంఠరావులు చేరుకుని వివరాలను సేకరించారు. జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందజేసి ప్రభుత్వం నుంచి పరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు సంబంధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.