ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి నుంచి కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి 108 వాహన సిబ్బంది నిరాకరించడంతో ఓ తండ్రి తన బైక్ పైనే కొడుకు శవాన్ని తరలించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంగంలో బుధవారం శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) అనే ఇద్దరు పిల్లలు బహిర్భూమికి వెళ్లి కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందారు. ఈశ్వర్ మృతదేహాన్ని కాలువ వద్ద నుంచి ఇంటికి తీసుకెళ్లారు. కొన ఊపిరితో ఉన్న శ్రీరామ్ ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే శ్రీరామ్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని 108 వాహన సిబ్బందిని బాలుడి తండ్రి కోరాడు. నిబంధనలు అంగీకరించవంటూ వారు అందుకు నిరాకరించారు. మహాప్రస్థానం వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో ఆటోలు, ఇతర వాహనాల వారిని బతిమాలినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ తండ్రి తన బైక్ పైనే కొడుకు శ్రీరామ్ మృతదేహాన్ని ఇంటికి తరలించారు.