కరోనా తగ్గినట్లే తగ్గి ప్రపంచ దేశాల్లో విరుచుకుపడుతోంది. భారత్‌లో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, పొరుగున ఉన్న చైనాలో పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌పై కలవరం వ్యక్తం అవుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కొత్తవి పుట్టుకొస్తున్నాయని డబ్ల్యుహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్లు బీఏ 4, బీఏ 5 దక్షిణాఫ్రికాలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ప్రమాదకర పరిస్థితులను సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయన్నారు.
మిగిలిన దేశాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని, అయితే దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రతాపం చూపిస్తోందని టెడ్రోస్ అన్నారు. ఈ విషమ పరిస్థితుల నుంచి బయట పడడానికి వ్యాక్సిన్ ఒక్కటే సాయపడుతుందన్నారు. ప్రాణాపాయం నుంచి తప్పించడానికి వ్యాక్సిన్ దోహదపడుతుందన్నారు. గత వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుందని, అయితే మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఊరటనిస్తోందని ఆయన పేర్కొన్నారు. గత వారం వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్‌తో 15 వేల మరణాలు నమోదయ్యాయన్నారు.