సాధారణంగా మార్కెట్లో మామిడి పండ్ల ధర కిలోకి గరిష్ఠంగా రూ.200 ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్ పండే 'నూర్జహాన్' మామిడి మాత్రం ఒక్క పండు ధర రూ.1000 కు పైగా పలుకుతుంది. నూర్జహాన్ రకం మామిడి పండ్ల బరువు కిలోల్లో ఉంటుంది. ఇప్పుడు వాటి ధర రూ.1000 నుంచి రూ.2000 పలుకుతోంది.
ఆప్ఘాన్ మూలానికి చెందిన 'నూర్జహాన్' మామిడిని మధ్యప్రదేశ్ లోని అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారు. గతేడాదితో పోలిస్తే ఈ పండు పరిమాణం ఈసారి పెరిగింది. దీంతో ఒక్కోటి ఈ సీజన్‌లో రూ.1000 నుంచి రూ.2000 పలుకుతోందని రైతులు పేర్కొంటున్నారు. చాలా మంది ఈ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటారు. జూన్ 15 నాటికి అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ఒక్కో మామిడి పండు బరువు 3.5 కిలోల నుంచి 4 కిలోల మధ్య ఉంటుంది.