ఏపీలో వరుసగా టెన్త్ పేపర్లు లీక్ అవడం వెనుక వైసీపీ లీడర్ల హస్తం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా విశాఖ పర్యటనలో గురువారం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టెన్త్ పేపర్లు లీక్ అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏం పీకుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుషికొండలో వైసీపీ నేతలు రిసార్టులు ఆక్రమించి, భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దీనిని పరిశీలించేందుకు తాను వెళ్తుంటే పోలీసులతో అడ్డుకున్నారని అన్నారు. తాను దేశంలో ఎక్కడికైనా వెళ్తానని, అడ్డుకుంటే ఖబడ్దార్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతుంటే బాధ్యత గల హోం మంత్రి వనిత చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరిగితే తల్లులతే బాధ్యత అని చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు.
వైఎస్ జగన్ పాలన చేపట్టాక నిత్యావసరాల ధరలు పెరిగాయని, పెట్రోల్ రేట్లు పెరిగాయని, భూముల ఆక్రమణలు, దౌర్జన్యాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని అన్నారు. విశాఖను దేశంలోనే నంబర్ 1 నగరంగా తీర్చిదిద్దుతానని గతంలో చెప్పానని, ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నానని అన్నారు.