ఇప్పటికే 'కరోనా' వైరస్ దేశాన్ని అతలాకుతలం చేసింది. దీనికి తోడు కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లు ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కేరళలో మరో వైరస్ ప్రతాపం చూపిస్తోంది. 'షిగెల్లా' బ్యాక్టీరియా కారణంగా కేరళలో ఒకరు మృతి చెందారు. మరో 58 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేరళలోని కాసరగోడ్ సమీపంలోని కరివల్లోర్ ప్రాంతానికి చెందిన దేవానంద అనే 16 ఏళ్ల బాలిక ఫుడ్ పాయిజన్ కారణంగా షిగెల్లా బారిన పడింది. కన్హంగాడ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో కలవరం మొదలైంది.
ఇదిలా ఉండగా తిరువనంతపురం నుండి వచ్చిన 23 మంది సభ్యుల పర్యాటక బృందానికి ఫుడ్ పాయిజన్ ఎదురైంది. వాయనాడ్ జిల్లాలో మూడు వేర్వేరు ప్రదేశాల నుండి ఆహారాన్ని తిన్నారు. తర్వాత వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. వీరు కూడా షిగెల్లా బారిన పడ్డట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 58 మంది షిగెల్లా బారిన పడ్డారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. అపరిశుభ్రత కారణంగానే ఇది వ్యాప్తి చెందుతుందని, తరచూ చేతులు కడుక్కోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.