ఏపీలో ఏలూరు జిల్లాలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రత్యర్థి వర్గాలు ఆయనను ముందస్తు ప్లాన్ ప్రకారం హతమార్చాయని పోలీసులు తేల్చారు. అయితే దీనికి రాజకీయ రంగు పులుము కోవడంతో ఈ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అయితే హత్య వెనుక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హస్తం ఉందని మృతుడి కుటుంబికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఎమ్మెల్యే తలారిపై మృతుడి బంధువులు, సన్నిహితులు, గ్రామస్తులు దాడి చేశారు. అయితే ఈ దాడి వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.
తనపై దాడి చేసింది టీడీపీ వారేనని ఆరోపించిన ఎమ్మెల్యే వెంకట్రావు దానికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందు ప్రదర్శించారు. తనపై దాడి చేసిన ఫొటోలను చూపిస్తూ, అందులో టీడీపీ వారు ఉన్నారని చెప్పారు. టీడీపీ నేతలు చేసిన దాడిలో తనతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయన్నారు. తనను చంపాలని చూశారని, దానిని రాజకీయ హత్యగా మార్చేయాలని టీడీపీ వారు భావించారని ఆరోపించారు. మృతుడు గంజి ప్రసాద్ వైసీపీ నాయకుడని, ఆయనకు పార్టీతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు.