ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 15వ తేదీన తొలివిడత పెట్టుబడి సాయం అందించనుంది. ఈ ఏడాది 48.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నారు. అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం శుక్రవారం నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆర్బీకేల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులకు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలని అధికారులు తెలిపారు.
ఈ పథకం కింద అర్హులైన ప్రతి భూ యజమానులకు ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్ లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు. 2022-23 లో 48.77 లక్షల అర్హులైన రైతు కుటుంబాలకు మొదటి విడతగా ఈ నెల 15న రూ.3,657.87 కోట్ల సాయం అందించబోతున్నారు.