ఏపీలో నానాటికీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో వైసీపీకి వ్యతిరేకంగా పొత్తులపై ప్రతిపక్ష నేతల నుంచి కీలక వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ సర్కారును గద్దె దించేందుకు తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. బాదుడే బాదుడు పేరుతో జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. టెన్త్ పరీక్షలు కూడా సీఎం జగన్ సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని, అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలను అరికట్టలేకపోతున్నారని, అన్నింటా విఫలమయ్యారని చెప్పారు.
వైసీపీని గద్దె దించాలంటే ప్రజా ఉద్యమం రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ విషయంలో టీడీపీ నేతృత్వం వహిస్తుందని, అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పాటు ఇతర ప్రతిపక్షాల ఐక్యత కోసం చంద్రబాబు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లా పర్యటనలతో పార్టీ శ్రేణులను ఎన్నికలకు రెండేళ్ల ముందే సమాయాత్తం చేస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు ఉంటే, కలిసికట్టుగా సాగాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల వాతావరణం కాస్త ముందుగానే వచ్చిందనే చర్చలు సాగుతున్నాయి.