ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా వందకు పైగా మహిళలను అతడు వేధించాడు. మొత్తం 36 జిల్లాలలో అతడి వేధింపులకు ఇబ్బంది పడిన మహిళలు, యువతులు ఉన్నారు. అతడి లైంగిక వేధింపులను భరిస్తూ వచ్చిన వారంతా ఒకరి తర్వాత ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. వందల సంఖ్యలో అతడిపై మహిళలు చేస్తున్న ఫిర్యాదులను చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఈ కేసుకు సంబంధించి, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాఘవేంద్ర మౌర్య అనే వ్యక్తి స్త్రీలోలుడు. అందంగా కనిపించిన మహిళలు, యువతుల వెంట పడేవాడు. వారిని లైంగికంగా వేధింపులకు గురి చేసే వాడు. తన కన్ను పడిన మహిళల ఫోన్ నంబర్లను వివిధ మార్గాల ద్వారా సంపాదించేవాడు. ఆపై వారికి నరకం చూపించే వాడు. అతడి ఆగడాలను కొన్నాళ్ల పాటు భరించిన బాధిత మహిళలు వేర్వేరుగా అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఏకంగా యూపీ వ్యాప్తంగా 36 జిల్లాలలో అతడిపై 113 కేసులు నమోదయ్యాయి. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 200లకు పైగా మహిళల ఫోన్ నంబర్లను గుర్తించారు. ఇతడి వేధింపులకు మరింత మంది మహిళలు బాధితులని పోలీసులు వెల్లడించారు. ఇటువంటి ఘటనలు ఎదురైనప్పుడు మహిళలు నిర్భయంగా తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.