ఆ వ్యక్తికి తన భార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఆమెతో కలకాలం కలిసి బ్రతకాలని అనుకున్నాడు. అకస్మాత్తుగా ఓ రోజు ఆమె చనిపోవడం తట్టుకోలేకపోయాడు. జీవిస్తే ఆమెతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
థాయ్‌ల్యాండ్‌కు చెందిన విశ్రాంత సైనికాధికారి చాన్ చనవచరకర్న్‌కు తన భార్య అంటే చాలా ఇష్టం. ఆమె లేని జీవితం అతడు ఎప్పుడూ ఊహించుకోలేదు. అయితే 2001లో ఆయన భార్య చనిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆయన డీలా పడిపోయాడు. ఎప్పుడూ భార్య తనతోనే ఉండాలని భావించాడు. దీంతో తన భార్య మృతదేహాన్ని శవపేటికలో పెట్టి 21 ఏళ్లుగా సంరక్షిస్తూ వస్తున్నాడు. రోజూ భార్య శవపేటిక వద్ద కూర్చుని, ముచ్చట్లు చెప్పేవాడు. ప్రస్తుతం ఆయన వయసు 72 ఏళ్లకు చేరుకుంది. ఈ క్రమంలో తన సంరక్షణే తనకు కష్టంగా మారింది. ఈ తరుణంలో భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని భావించాడు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో ఇటీవల తన భార్య మృతదేహానికి 21 ఏళ్ల తర్వాత కర్మకాండలు నిర్వహించాడు. ఆ తర్వాత ఆమె చితాభస్మాన్ని, అస్తికలను ఓ కలశంలో పెట్టుకుని, ఇంటికి తీసుకెళ్లాడు. తాను చనిపోయేంత వరకు అవి తనతోనే ఉంటాయని ఎంతో ఆవేదనతో చెప్పాడు.