ట్విట్టర్ లో ఉద్యోగ భద్రత అంశం తాజాగా చర్చకు తెరలేపింది. ఇదిలావుంటే ట్విట్టర్ సీఈఓ గా ఉన్న పరాగ్ అగర్వాల్ కు ఉధ్వాసన తప్పదన్నట్లు పూర్తి సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరహా చర్చ సాగుతోంది. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కు.. ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ ఉద్వాసన పలుకుతున్నారా? ఇప్పటికే టెస్లా సీఈవోగా ఉన్న ఆయనే.. ట్విట్టర్ బాధ్యతలనూ చూసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొన్ని రోజుల క్రితమే 4,400 కోట్ల డాలర్లకు ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పరాగ్ అగర్వాల్.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పరాగ్ ను మస్క్ తొలగించనున్నట్టు సంస్థ వర్గాలు, పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. కొత్త సీఈవోను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఆ కొత్త సీఈవో వచ్చే వరకు కొన్ని రోజుల పాటు ట్విట్టర్ కు తాత్కాలిక సీఈవోగా ఎలాన్ మస్క్ బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పరాగ్ ను తొలగిస్తే ఆయనకు 4.3 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటు మరో ఇండియన్ ఎగ్జిక్యూటివ్, కంపెనీకి లీగల్ హెడ్ అయిన విజయ గద్దెనూ ఆయన తొలగించే అవకాశాలున్నట్టు సమాచారం. ఆమెకూ 1.25 కోట్ల డాలర్ల మేర పరిహారం ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు.
సంస్థను మస్క్ కొనుగోలు చేశాక.. కంపెనీ ఉద్యోగుల భవిష్యత్ అంధకారంలో పడిపోతుందని పరాగ్ అగర్వాల్ పదే పదే మీటింగులు పెట్టి చెప్పారు. ఇటు మస్క్ కూడా పరాగ్ కు గట్టి కౌంటర్లే ఇచ్చారు.. భద్రత లేదనుకునేవాళ్లు వెళ్లిపోయినా తనకేమీ అభ్యంతరం లేదన్నారు. ఉండేవాళ్లే ఉంటారన్నారు. తన జాబ్ గురించి తనకేం బెంగ లేదని, వదిలేయడానికీ సిద్ధమేనని పరాగ్ కూడా అన్నారు.