ప్రతి సైనికుడు దేశానికి సేవ చేసే అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తాడు. అంతే వారి పరిస్థితి దినదిన ప్రాణగండం గా ఉంటుంది. అలా ఓ తల్లి తన కుమారుడు సరిహద్దులో దేశాన్ని రక్షించే సైనికుడిగా మారినందుకు ఆనందపడింది. కానీ, ఆ బిడ్డ విధులకు వెళ్తుంటే మాత్రం తల్లడిల్లిపోయింది. తిరిగి వస్తాడో లేదో తెలియని సందిగ్ధంతోనే నవ్వుతూ వీడ్కోలు పలికింది. ఆ వెంటనే తలుపు మాటున కన్నీటి పర్యంతమైంది. లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. '30 ఏళ్ల క్రితం నేను నా తల్లిని కోల్పోయాను. ప్రతి సైనికుడి తల్లిలో తనను చూసుకుంటున్నాను. నా మాతృభూమి స్పర్శలో తనను స్మరించుకుంటున్నాను. అమ్మా నీకు వందనం' అంటూ ఆయన ఈ ఫోటోను షేర్ చేశారు. 'త్యాగానికి ఇంతకు మించిన అర్థం ఉంటుందా?' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.