చాలా మందికి పొద్దున్నే లేవగానే మొదలు కాఫీ తాగనిదే రోజు గడవదు. రోజులో చాలా సార్లు కాఫీని చాలా ఇష్టంగా తాగేస్తుంటారు. ఇలా కాఫీ తాగితే ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. లాభాలను పరిశీలిస్తే కాఫీ మీ శారీరక పనితీరును పెంచుతుంది. బరువు తగ్గడానికి కాఫీ మీకు సహాయపడుతుంది. కాఫీ తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా తగ్గుతుంది. ఏకాగ్రత, అప్రమత్తంగా ఉండటానికి దోహదపడుతుంది. 25 శాతం మరణ ప్రమాద ముప్పు తగ్గుతుంది. పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని, మహిళల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకుంటుంది. రోజూ 2 నుంచి 4 కప్పుల కాఫీ తాగితే గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి రాకుండా అడ్డుకోవడంతో పాటు, బాధితుల్లో ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది.
కాఫీ శరీరాన్ని రక్షిస్తుంది. కాఫీలో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. అంతేకాకుండా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్జీమర్స్ రాకుండా మెదడును రక్షిస్తుంది. మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచి, ఆత్మహత్య ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇక కాఫీ పరిమితికి మించి తాగితే నష్టాలు కూడా ఉన్నాయి. నాణ్యత లేని కాఫీ చాలా మలినాలను కలిగి ఉంటుంది. ఇది అనారోగ్యం, తలనొప్పిని కలిగిస్తుంది. నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గర్భిణులు ఒక కప్పు కంటే ఎక్కువ కాఫీ తాగకూడదు. అలా చేస్తే కడుపులోని బిడ్డకు ప్రమాదం ఎదురవుతుుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు సాధారణ కాఫీ తాగకూడదు. ఫిల్టర్ కాఫీ ఎంచుకోవడం మంచిది. ఇక 80-100 కప్పులు కాఫీ తాగితే ప్రాణాపాయ ముప్పు ఉంటుంది. వాంతులు ఎక్కువై చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.